- తాండూరును వదిలి కొడంగల్‌పైనే ప్రేమ ఎందుకు?
- కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు
- రోహిత్ రెడ్డిపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పైనే ఆరాటం చూపుతున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి కొడంగల్ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…
తాండూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆసుపత్రులు, చివరికి తాండూరు ఇసుకను కూడా కొడంగల్‌కే తరలిస్తుంటే ఇక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అక్రమాల చిట్టా తమ వద్ద ఆధారాలతో సహా ఉందని, త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రాంతంలో గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని, అభివృద్ధి పేరిట ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుకుంటూ దోచుకుంటున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన స్థాయి కూడా లేని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోహిత్ రెడ్డిపై నోరుపారేసుకుంటే సహించేది లేదని, అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ మోజు వీడి తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లు ఇర్షాద్,సురేష్ నాయక్ అనిల్ బోయ, నాయకులు రుద్రు పాటిల్,సంతోష్ గౌడ్,అసిఫ్,కరుణాకర్, ఏజాస్,అనంతరెడ్డి,తదితరులు ఉన్నారు.



