- తాండూరు అభివృద్ధికి 1000 రోజుల్లో ₹1200 కోట్లు
- ఇవి ఉత్తుత్తి జీవోలు కావు… అక్షర సత్యాలు
- అభివృద్ధి ఆధారాలతో బ్రోచర్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు
- అబద్ధమైతే చర్చకు రావాలని సవాల్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన వెయ్యి రోజుల పాలనలో రూ.1200 కోట్ల నిధులు వెచ్చించామని, ఇవి కాగితాలకే పరిమితమైన ఉత్తుత్తి జీవోలు కావు అని, అక్షర సత్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. తాండూరు ప్రజలు అభివృద్ధిని, ఆదర్శవంతమైన రాజనీతిని కోరుకుంటున్నారని, ఉద్రేకాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని చూసే కుటిల రాజకీయాలను వారు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి కె. గోపాల్, వసీం, ఓల్డ్ తాండూరు వసీం, కౌన్సిలర్ ఎల్లప్ప లు మాట్లాడుతూ…
1000 రోజుల్లో చేపట్టిన రూ.1200 కోట్ల అభివృద్ధి పనుల సమగ్ర వివరాలతో కూడిన ‘అభివృద్ధి బ్రోచర్’ను వారు విడుదల చేశారు.
ఈ బ్రోచర్‌ను నేరుగా ప్రజాక్షేత్రంలోనే ఉంచుతున్నామని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని నాయకులు ప్రకటించారు. బ్రోచర్లో పేర్కొన్న వివరాలు అబద్ధమైతే ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ముందుకు రావాలని సవాల్ విసిరారు. వచ్చే ఐదేళ్లలో కేవలం ఎన్నికల లబ్ధి కోసం కాకుండా, రాబోయే భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటునరని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆచరిస్తున్న రాజనీతిజ్ఞతకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల కాలేదు? ఆ నిధులు ఎక్కడికి తరలిపోయాయో విపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 1000 రోజుల కాంగ్రెస్ పాలనలోనే తాండూరు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విధ్వంసకర పాలన నుంచి వికాసం వైపు వేగంగా అడుగులు వేస్తోందని నాయకులు స్పష్టం చేశారు.



