- శిశు మందిర్ వికాసానికి ఆర్బీఓఎల్ సీఈఓ విరాళం
- విద్యార్థులే భారత నిర్మాతలు
- కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు ఆర్బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు రూ. 5,00,000 విలువైన చెక్కును ఆయన నేరుగా అందజేశారు.
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తును నిర్మించే శిల్పులని పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృతి, నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో సరస్వతీ విద్యా పీఠం, శిశు మందిర్ పాఠశాలలు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమన్నారు. పిల్లల్లో దేశభక్తి, సామాజిక స్పృహ పెంపొందిస్తున్న ఈ విద్యాలయాల వికాసానికి తనవంతు బాధ్యతగా ఈ సాయం అందించానని, మున్ముందు కూడా పాఠశాలకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లేశం, పాఠశాల అధ్యక్షుడు కటకం వీరేందర్, యాజమాన్య కమిటీ సభ్యులు పెరుమాళ్లా రాం రెడ్డి, అనంత రెడ్డి, జి. నరేందర్ పాల్గొన్నారు. వీరితో పాటు కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, ఎం. రామకృష్ణ, ఎన్. రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, భీంశెట్టి మధుసూదన్, సుబ్బారావు, ప్రభుశంకర్, జోషి వికాస్, ప్రహ్లాద్, సమద్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



