- ఘనంగా నివాళులర్పించిన విద్యా వికాస్ సమితి ట్రస్ట్
తాండూరు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శశి ప్రభ మాణిక్ రావు
జనవాహిని ప్రతినిధి తాండూరు; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏఐసీసీ మాజీ సభ్యులు ఎం. మాణిక్ రావు వర్ధంతి వేడుకలు మంగళవారం విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా మాణిక్ రావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన సమాధి స్థలంలో హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు మాట్లాడుతూ… తాండూరు ప్రజల విద్యా, వైద్యం, ఉపాధి అభ్యున్నతి కోసమే మాణిక్ రావు తమ కోట్లాది రూపాయల ఆస్తులను ట్రస్ట్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. భూబకాసురులు, ల్యాండ్ గ్రాబర్లు ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేయాలని చూస్తే, వందలాది మంది న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని 14 కేసుల్లో సుదీర్ఘంగా పోరాడి గెలిచామని చెప్పారు. మాణిక్ రావు ఆశయం ప్రకారం విద్యా వికాస సమితి ట్రస్ట్ ఆస్తులు తాండూరు ప్రజల సంక్షేమానికే ఉపయోగపడతాయని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, ఎన్. రామకృష్ణ, ఎన్. రఘు ముదిరాజ్, కె. చంద్రకాంత్, బిఆర్ఎస్ నేత శుభప్రద పటేల్, ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ పెద్దేముల్ అరుణ్ రాజ్, కచ్చి సయ్యద్, ముస్తఫా పటేల్, భాను ప్రసాద్, వర్కింగ్ జర్నలిస్టులు, మాణిక్ రావు అభిమానులు పాల్గొన్నారు.

