- తాండూరు అభివృద్ధికి మాణిక్‌రావు సేవలు చిరస్మరణీయం
- మాజీ మంత్రి జయంతి వేడుకల్లో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
- ఘనంగా నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు ప్రాంత సమగ్ర అభివృద్ధికి, నియోజకవర్గంలో ప్రాజెక్టుల నిర్మాణానికి స్వర్గీయ మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ కొనియాడారు. ‘తెలంగాణ సర్దార్’గా పేరుగాంచిన మాణిక్‌రావు జయంతి వేడుకలను తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులార్పించారు.
అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జైలు జీవితం అనుభవించిన పోరాట యోధుడు మాణిక్‌రావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీల హక్కులు, సమస్యలపై తొలిసారిగా బలంగా గళమెత్తిన ధీరుడని గుర్తుచేశారు.
తాండూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత మాణిక్‌రావుకే దక్కుతుందన్నారు. వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తాండూరులో ‘పీపుల్స్ డిగ్రీ కళాశాల’ను ఏర్పాటు చేసి, వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేశారని గుర్తు చేశారు.
మాణిక్‌రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వడ్డే సత్యనారాయణ, మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, బసంత్ కుమార్, యువ నాయకులు జోసఫ్, శ్రీకాంత్, బసవరాజ్, నాయి రాజు, అరుణ్ రాజ్, మోచిరాజు, పవన్, శివకుమార్, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



