- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై బిఆర్ఎస్ ఆరోపణలు నిరాధారం
- దేవాలయ అభివృద్ధిని అడ్డుకోవద్దు: ఎస్. ప్రసాద్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు; స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు శ్రీ పోట్లీ మారాజ్ దేవాలయంపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవాస్తవ, నిరాధారమైన ఆరోపణలను వెంటనే మానుకోవాలని ఆలయ కార్యవర్గ సభ్యులు ఎస్. ప్రసాద్ గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ …
ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికారు. నిన్న బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ మరికొందరు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. శ్రీ పోట్లీ మారాజ్ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోని అత్యంత పవిత్రమైన స్థలమని తెలిపారు. ఆలయాన్ని కూల్చివేస్తున్నారని, స్థలాలను కబ్జా చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, ధైర్యముంటే దానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని సవాలు విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దేవాలయాన్ని వివాదాల్లోకి లాగడం తగదన్నారు.
దేవాలయ స్థలంలో నిబంధనల ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆలయానికి ఆదాయం సమకూర్చడం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచనల మేరకు చట్టానికి, ధర్మానికి లోబడే పనిచేస్తున్నామని తెలిపారు. దేవాలయ పవిత్రతను కాపాడటానికి, ఆలయాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆధారాలు లేని ఆరోపణలకు స్వస్తి పలకాలని ప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు.



