- ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
- కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు బిఆర్ఎస్ కౌంటర్
- అబద్ధపు కేసులతో బిఆర్ఎస్ను ఆపలేరు
- రోహిత్ రెడ్డి నేతృత్వంలో తాండూరుపై మళ్లీ గులాబీ జెండా ఖాయం
జనవాహిని ప్రతినిధి తాండూరు; ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ పార్టీ 34వ వార్డు కౌన్సిలర్ సుప్రీత కరుణాకర్ విమర్శలు చేశారు. గంజాయి, డ్రగ్స్ కేసులలో మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్లారంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను ఆమె ఖండించారు.
ఈ సందర్భంగా సుప్రీత కరుణాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల సంక్షేమామే ధ్యేయంగా సుపరిపాలన అందించిన ఘన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేశారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఎన్ని అబద్ధపు కేసులు, కుట్రపూరిత ఆరోపణలు చేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో బిఆర్ఎస్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాండూరు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు, వైఫల్యాలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.



