- భద్రేశ్వర ఆలయం!
- మేడి మహేష్‌కు బిఆర్‌ఎస్ నాయకుడు రుద్రు పాటిల్ కౌంటర్
- దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
- విమర్శలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు
జనవాహిని ప్రతినిధి తాండూరు; పవిత్రమైన శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి కాదని, పవిత్ర స్థలాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు రుద్రు పాటిల్ మండిపడ్డారు. దేవాలయం ప్రాంగణంలో వార్తా సమావేశం నిర్వహించి మాట్లాడిన మేడి మహేష్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రుద్రు పాటిల్ మాట్లాడుతూ… భద్రేశ్వర దేవాలయ రినోవేషన్ కమిటీ చైర్మన్ ఆర్డర్ కాపీనే ఇంకా రాలేదని, అలాంటప్పుడు మేడి మహేష్ అసలు ఏ హోదాలో ఉండి మాట్లాడుతున్నారని నిలదీశారు. చేతిలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులూ లేకుండా చైర్మన్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మేడి మహేష్ మిగితా సభ్యులు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని, అది భద్రేశ్వర దేవాలయంలోని పవిత్రమైన ‘దాసోహం’ అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. భక్తుల భావోద్వేగాలు, నమ్మకాలతో ముడిపడి ఉన్న ఆలయ ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.
భద్రేశ్వర దేవాలయంలో ‘దాసోహం’ నిర్మాణాన్ని చేపట్టి, నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. నేటికి కూడా యువదళ్ సభ్యులే స్వయంగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని, లేని క్రెడిట్ కొట్టేయాలని చూస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ దుర్మార్గపు రాజకీయాలను పక్కనపెట్టి, ఆలయ పవిత్రతను కాపాడాలని హెచ్చరించారు.



