- ఇర్షాద్ ఆరోపణలను ఖండించిన బాతుల నాగు
- పేదలను ముంచిన చరిత్ర నీది
- ఆధారాలు ఉంటే చూపించు: కౌన్సిలర్ ఇర్షాద్కి బాతుల నాగు సవాల్
జనవాహిని ప్రతినిధి తాండూరు; కౌన్సిలర్ ఇర్షాద్ తనపై చేసినవన్నీ పచ్చి అబద్ధాలని, ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలని తాండూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు మండిపడ్డారు. తనపై కౌన్సిలర్ ఇర్షాద్ చేసిన వ్యాఖ్యలను నాగు ఖండించారు.
ఈ సందర్బంగా రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారే చౌకబారు సంస్కృతి నాది కాదని, నేను ఎప్పుడైనా, ఎవరి కాళ్లయినా మొక్కినట్లు నిరూపించగలవా? అంటూ నాగు సవాల్ విసిరారు. తాండూరు ప్రజలందరికీ ఇర్షాద్ ఎలాంటి బ్లాక్మెయిలరో స్పష్టంగా తెలుసని, అక్రమ దందాలు చేసే అలవాటు తనకంటే ఇర్షాద్కే ఎక్కువగా ఉందన్నారు. గతంలో తమ కుటుంబంలో జరిగిన భూవివాదం పూర్తిగా వ్యక్తిగతమని, అందులో రూపాయి చేతులు మారినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ వ్యవహారాలు, కుటుంబం కలహాలు వల్ల రోడ్డున పడకుండా చూసుకోవాలన్నారు.
గతంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ ఉదంతంలో, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విట్టల్ రెడ్డి బహిరంగంగా అందరి ముందే ఇర్షాద్ను రాస్కెల్,స్టుపిడ్ అంటూ బూతులు తిట్టి అసహ్యించుకున్నారో తాండూరు ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు.
తన కుటుంబ సభ్యులు వ్యాపార రీత్యా వడ్డీకి డబ్బులు ఇవ్వడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ— ప్రజలు కష్టాల్లో ఉండి, తమ ఇంటి గడప తొక్కి సహాయం కోరితేనే వడ్డీకి ఇస్తాం తప్ప బలవంతంగా ఎవరికీ ఇవ్వంమని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి, చివరికి వారిని ముంచిన ఘన చరిత్ర ఇర్షాద్దే అని బాతుల నాగు విమర్శించారు. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.



