- అమ్మాయిల సప్లై, డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లిన సంస్కృతి బిఆర్ఎస్ నాయకులది
- బిఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నిందలు వేస్తే ఊరుకోం: తాండూరు కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. గురువారం బిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వద్దే శ్రీను, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ ఎల్లప్ప తదితరులు పాల్గొని ఖండించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అబద్ధాల కంచుకోట అని, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ప్యాకేజీ స్టార్‌లు ఇప్పుడు ప్రెస్ మీట్‌లు పెట్టి మచ్చ లేని నాయకుడు మనోహర్ రెడ్డిపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ నువ్వు ఒక ఐరన్ లెగ్వి, ఎక్కడుంటే అక్కడ భస్మమే అవుతుందన్నారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో పాటు ఇతర నాయకుల వద్ద ప్యాకేజీలు తీసుకున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.
మీ మాజీ ఎమ్మెల్యేనే గంజాయి, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా అమ్మాయిలను సప్లై చేసే దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లే సంప్రదాయం మీ మాజీ ఎమ్మెల్యేదేనని, అలాంటి చరిత్ర ఉన్నవారు, ప్రజాసేవకుడైన మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారనడానికి ఆధారాలు ఎక్కడున్నాయని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన హయాంలో ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, ఉత్తుత్తి శిలాఫలకాలతో ప్రజలను మభ్యపెట్టారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అప్పట్లో తాము వెనుక ఉండి నడిపించినా, తమపైనే దౌర్జన్యాలు చేశారని గుర్తుచేశారు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించడానికి ఎమ్మెల్యే దాకా అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులమైన మేమే చాలని స్పష్టం చేశారు.
డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదవులు ఇస్తున్నారని తెలిపారు. సైపూర్ కు చైర్మన్ పదవి ఇస్తానని మాజీ ఎమ్మెల్యే మోసం చేస్తే, తమ నాయకుడు మనోహర్ రెడ్డి కేవలం సైపూర్ కే 3 చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించారని ప్రకటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసమే నిబంధనల ప్రకారం ఇసుక అనుమతులు ఇస్తున్నామని, బిఆర్ఎస్ నాయకుల్లా దొంగతనంగా ఇసుకను దోచుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజు గౌడ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.



