- మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
- కాంగ్రెస్ హామీలపై అగ్రహం
- బాకీలాన్ని వసూళ్లు చేస్తాం అంటూ భారీ నిరసన
జనవాహిని ప్రతినిధి తాండూరు ; ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, ప్రజలకు రావాల్సిన ప్రతి బాకీని వసూలు చేసే వరకు పోరాటం ఆగదని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శన హోరెత్తింది.
బీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం వైఫల్యాలపై “తాండూర్ చార్జ్‌షీట్”, “బాకీ కార్డు”లను ఆవిష్కరించిన అనంతరం, 420 హామీల ఫ్లెక్సీతో ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.82,500, పెన్షన్ల రూపంలో రూ.66,000, రైతు భరోసా ఇవ్వక నాలుగు ఎకరాలున్న రైతుకు రూ.1.02 లక్షల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండిపడ్డారు. స్కూటీలు, తులం బంగారం, విద్యాభరోసా హామీలన్నీ అటకెక్కాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, అక్రమ కేసులకు భయపడకుండా కేసీఆర్ నాయకత్వంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.



