- కౌన్సిలర్ జావీద్ హెచ్చరిక
- అక్రమాలు నిరూపించాలని డిమాండ్..
- ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఛైర్‌పర్సన్ తనపై కావాలని కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
తనపై మోపిన అక్రమ దందాల ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని కౌన్సిలర్ జావీద్ స్పష్టం చేశారు. తాను ఎక్కడ, ఎవరితో కలిసి బియ్యం దందా లేదా ఇతర అక్రమాలకు పాల్పడ్డానో ఛైర్‌పర్సన్ వెంటనే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ, స్థానికంగా తాండూరులోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, దమ్ముంటే తనపై మోపిన నిందలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఛైర్‌పర్సన్‌పై ‘ఇజ్జత్ దావా’ వేసి కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైఖరిని కూడా ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే 37వ కౌన్సిలర్‌గా వచ్చి కూర్చోవడం తప్ప, ఏ ఒక్క వార్డుకు ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి 8వ వార్డు పరిధిలోని రాజీవ్ ఇందిరమ్మ కాలనీ ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారని, అలాంటి వార్డుకు పాలకులు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. గడిచిన మూడేళ్లలో మున్సిపాలిటీలోని నిరుపేదలు నివసించే స్లమ్ వార్డులకు ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత అభివృద్ధి చేశారో బహిరంగంగా వెల్లడించాలని జావీద్ డిమాండ్ చేశారు.



