- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతిపై బీఆర్ఎస్ విరుచుకుపాటు
- ఫ్యూచర్ సిటీలో భూములతో పాటు ప్రభుత్వ, అటవీ స్థలాల కబ్జా
- డీసీసీబీ నిధుల దుర్వినియోగం, ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్న వైనం
- వెంటనే రాజీనామా చేయాలని బిఆర్ఎస్ సీనియర్ నేతల డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదిగో అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సేవను పక్కనబెట్టి భూముల దందాలు, వ్యాపారాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఎకరాలు కొని బకరాలకు అమ్ముతున్నారంటూ ఇటీవల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడమే ఎమ్మెల్యే తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీ పరిధిలోని తుమ్మలూరు వద్ద సిబీఐ కేసు, ఎస్బీఐ బ్యాంకు రుణాలు, హైకోర్టు స్టే ఉన్న 24 ఎకరాల వివాదాస్పద భూమిని ఎమ్మెల్యే కుమారుడు కొనుగోలు చేసి విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ 5 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని, ఆనుకుని ఉన్న అటవీ భూమిని కూడా కబ్జా చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు చెందిన ‘జేబీ ఇన్ఫ్రా’ కంపెనీ ద్వారా కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమాయకులకు విక్రయించారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినా దర్జాగా విక్రయాలు సాగించారని విమర్శించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా వీర్లపల్లి, కేసారం, ఎస్పల్ల గ్రామాల పరిధిలో 250 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా అమ్మేశారని, దీంతో వందలాది మంది బాధితులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో ఎలాంటి టెండర్లు లేకుండా గోదాములు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల నిర్మాణ పనులను ఒకే కాంట్రాక్టర్కు కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో అనేక సహకార సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు.
తాండూరులో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ దాడులు జరుగుతున్నా ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా ఆగడం లేదని, చంద్రవంచ గ్రామం నుంచి సిమెంట్ పరిశ్రమకు 500 టిప్పర్ల ఇసుకను, యాలాల శివసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండటం వెనుక అక్రమార్కులను రక్షించే కుట్ర ఉందని విమర్శించారు. ఆలయ ఖాళీ స్థలాల్లో దుకాణాల నిర్మాణంలోనూ టెండర్లు లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, మనోహర్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.



