- తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు సమస్యలపై నిలదీసిన కౌన్సిలర్ బోయ అనిల్
- అధ్వానంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లకు ప్రత్యేక నిధులు
- తీవ్రమైన నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం
- ఇందిరానగర్ పార్కు అభివృద్ధికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక వార్డు కౌన్సిలర్ బోయ అనిల్ కౌన్సిల్ సమావేశంలో గళం విప్పారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో వార్డులోని ప్రధాన సమస్యలను ఆయన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ్యంగా 6వ వార్డులోని పబ్లిక్ టాయిలెట్లు తీవ్రంగా పాడైపోయి అధ్వానంగా తయారయ్యాయని, దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. టాయిలెట్ల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సభలో హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ప్రస్తావించగా, త్వరలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ తెలిపారు.
ఇందిరా నగర్ 6వ వార్డు పరిధిలో ఉన్న మున్సిపల్ పార్కు దాదాపు 5 వార్డుల ప్రజలకు ప్రయోజనకరంగా ఉందని, దానిని మరింత అభివృద్ధి చేయాలని కౌన్సిలర్ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి త్వరలోనే ఆ పార్కును స్వయంగా సందర్శించి, అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బోయ అనిల్ మాట్లాడుతూ.. 6వ వార్డు ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.



