- కాయకల్ప పొందిన ఆస్పత్రిలో కంపు కొడుతున్న పారిశుధ్యం
- ఆధ్వానంగా మాతృ శిశు సంరక్షణ కేంద్రం
- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నా పట్టించుకోరా?
- ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కాదు… అభివృద్ధి చేసి చూపించండి: 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ సవాల్
జనవాహిని ప్రతినిధి తాండూరు; గతంలో ప్రతిష్టాత్మక ‘కాయకల్ప’ అవార్డు సాధించిన మాత శిశు సంరక్షణ ఆసుపత్రి ప్రస్తుతం పారిశుధ్య లోపంతో కంపు కొడుతోందని, పాలకులు దీన్ని పూర్తిగా గాలికొదిలేశారని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాత శిశు ఆస్పత్రి ని అయన సందర్శించారు. ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
రోజూ పదుల సంఖ్యలో పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు వచ్చే ఆస్పత్రిలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న ఈ ఆస్పత్రిని పట్టించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రాంతాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే, చైర్మన్ తమ విఫలత్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, బాధ్యతాయుతంగా పనిచేయాల్సింది పోయి కేసులు పెట్టి రిమాండ్‌కు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలి తప్ప బెదిరింపులకు దిగడం సరికాదని సవాల్ విసిరారు.
ఆస్పత్రిలోని డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతూ తమ 8వ వార్డులోకి వస్తోందని, దీనివల్ల వార్డు ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, డ్రైనేజీ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

