Home Blog Page 4

ఎమ్మెల్యే రాజీనామా చెయ్యాలి…!

0
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతిపై బీఆర్‌ఎస్ విరుచుకుపాటు
  • ఫ్యూచర్ సిటీలో భూములతో పాటు ప్రభుత్వ, అటవీ స్థలాల కబ్జా
  • డీసీసీబీ నిధుల దుర్వినియోగం, ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్న వైనం
  • వెంటనే రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ సీనియర్ నేతల డిమాండ్

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదిగో అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సేవను పక్కనబెట్టి భూముల దందాలు, వ్యాపారాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఎకరాలు కొని బకరాలకు అమ్ముతున్నారంటూ ఇటీవల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడమే ఎమ్మెల్యే తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీ పరిధిలోని తుమ్మలూరు వద్ద సిబీఐ కేసు, ఎస్‌బీఐ బ్యాంకు రుణాలు, హైకోర్టు స్టే ఉన్న 24 ఎకరాల వివాదాస్పద భూమిని ఎమ్మెల్యే కుమారుడు కొనుగోలు చేసి విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ 5 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని, ఆనుకుని ఉన్న అటవీ భూమిని కూడా కబ్జా చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు చెందిన ‘జేబీ ఇన్‌ఫ్రా’ కంపెనీ ద్వారా కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమాయకులకు విక్రయించారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినా దర్జాగా విక్రయాలు సాగించారని విమర్శించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా వీర్లపల్లి, కేసారం, ఎస్పల్ల గ్రామాల పరిధిలో 250 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా అమ్మేశారని, దీంతో వందలాది మంది బాధితులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి టెండర్లు లేకుండా గోదాములు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల నిర్మాణ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో అనేక సహకార సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు.
తాండూరులో విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ దాడులు జరుగుతున్నా ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా ఆగడం లేదని, చంద్రవంచ గ్రామం నుంచి సిమెంట్ పరిశ్రమకు 500 టిప్పర్ల ఇసుకను, యాలాల శివసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండటం వెనుక అక్రమార్కులను రక్షించే కుట్ర ఉందని విమర్శించారు. ఆలయ ఖాళీ స్థలాల్లో దుకాణాల నిర్మాణంలోనూ టెండర్లు లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, మనోహర్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

మాంసం దుకాణాలు బంద్ …!

0
  • రేపు తాండూరులో మాంసం విక్రయాలు బంద్
  • నోటీసులు అందజేసిన మున్సిపల్ సిబ్బంది 

జనవాహిని ప్రతినిధి తాండూరు; శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని తాండూరు పట్టణ పరిధిలో మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు పురపాలక సంఘం కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని మటన్, చికెన్, చేపల దుకాణాలు, పశువుల/మేకల కటేళాలు మరియు హోటళ్లలో మాంసాహారం విక్రయించరాదని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా మాంసాహారాన్ని విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ సిబ్బంది మాంసం దుకాణదారులకు నోటీసులు అందజేశారు. వ్యాపారులు, హోటళ్ల యజమానులు మరియు పట్టణ ప్రజలు ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు.

అధ్వానంగా పబ్లిక్ టాయిలెట్లు…!

0
  • తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు సమస్యలపై నిలదీసిన కౌన్సిలర్ బోయ అనిల్
  • అధ్వానంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లకు ప్రత్యేక నిధులు
  • తీవ్రమైన నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం
  • ఇందిరానగర్ పార్కు అభివృద్ధికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక వార్డు కౌన్సిలర్ బోయ అనిల్ కౌన్సిల్ సమావేశంలో గళం విప్పారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో వార్డులోని ప్రధాన సమస్యలను ఆయన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ్యంగా 6వ వార్డులోని పబ్లిక్ టాయిలెట్లు తీవ్రంగా పాడైపోయి అధ్వానంగా తయారయ్యాయని, దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. టాయిలెట్ల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సభలో హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ప్రస్తావించగా, త్వరలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ తెలిపారు.
ఇందిరా నగర్ 6వ వార్డు పరిధిలో ఉన్న మున్సిపల్ పార్కు దాదాపు 5 వార్డుల ప్రజలకు ప్రయోజనకరంగా ఉందని, దానిని మరింత అభివృద్ధి చేయాలని కౌన్సిలర్ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి త్వరలోనే ఆ పార్కును స్వయంగా సందర్శించి, అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బోయ అనిల్ మాట్లాడుతూ.. 6వ వార్డు ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

పీఎస్ ముందే బెదిరించారు…!

0
  •  నర్సింలుపై మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆగ్రహం
  • పోలీస్ స్టేషన్ ముందే బెదిరింపులకు దిగారంటూ ఆరోపణలు
  • ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తానని వెల్లడి

జనవాహిని ప్రతినిధి తాండూరు; మున్సిపల్ 10వ వార్డు లో ఓడిపోయిన కౌన్సిలర్ నర్సింహులు అహంకారంతో ప్రవర్తిస్తూ, తనతో పాటు స్థానిక విలేకరులను బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆరోపించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ….
ఇటీవల తాను వస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుటే కావాలని నర్సింహులు నిలిపివేసి, ర్యాష్‌గా మాట్లాడుతూ నిన్ను చూసుకుంటా అని బెదిరించాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని, దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగకపోతే జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేస్తానని, అతడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
స్థానిక ఓ విలేకరిని కూడా నర్సింలు బెదిరించాడని మిత్రూ నాయక్ ఆరోపించారు. ప్రజాసమస్యలు, వాస్తవాలను సమాజానికి తెలిపే మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదన్నారు.
నర్సింలు మరో వ్యక్తి తో కలిసి భయభ్రాంతులకు గురిచేసి 5 గుంటల భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సదరు భూమికి సంబంధించిన డబ్బులను లేదా భూమిని న్యాయంగా బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడి ప్రమాణాల ద్వారా నిజానిజాలు బయటపెడతానని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో 10వ వార్డులో ఒక సాధారణ కుర్రాడి చేతిలో ఓడిపోయినా నర్సింలుకు బుద్ధి రాలేదన్నారు. తాండూరు మొత్తాన్ని ఏలేస్తానని, చైర్మన్ అవుతానని అహంకారంతో మాట్లాడినందుకే ప్రజలు, భగవంతుడు అతనికి తగిన శాస్తి చేశారు అని మిత్రూ నాయక్ స్పష్టం చేశారు.

చౌరస్తా పేరు ఖరారు.. స్థానికుల హర్షం..!

0
  • తాండూర్ మున్సిపాలిటీలో విలేమూన్ హై స్కూల్ చౌరస్తా పేరు ఖరారు
  • కౌన్సిల్ సమావేశంలో తీర్మానం
  • కౌన్సిలర్ ఇర్షాద్‌ను ఘనంగా
    సన్మానించిన పాఠశాల యాజమాన్యం

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూర్ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన కూడలికి విలేమూన్ హై స్కూల్ చౌరస్తా గా అధికారిక నామకరణం చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నిన్న నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ మేరకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు.
కూడలికి తమ పాఠశాల పేరును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్‌ను గురువారం విలేమూన్ హై స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ను పూలమాలలు, శాలువాతో సత్కరించి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వార్డు అభివృద్ధితో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌన్సిలర్ ఇర్షాద్ సేవలను అభినందించారు. చౌరస్తాకు విలేమూన్ హై స్కూల్ పేరు పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవాలకు సహకరించాలి..!

0
  • తాండూరులో ముమ్మరంగా వినాయక చవితి చందాల సేకరణ
  • హిందూ ఉత్సవ సమితికి విరాళం అందజేసిన నేతాజీ పాఠశాల యాజమాన్యం

జనవాహిని ప్రతినిధి తాండూరు;రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తాండూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో చందాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు నేతృత్వంలో ఉత్సవ సమితి ప్రతినిధులు పట్టణంలోని ముఖ్య వీధులు, వ్యాపార, విద్యా సంస్థ సందర్శనకు బయలుదేరారు. ఇందులో భాగంగా స్థానిక నేతాజీ పాఠశాల యాజమాన్యాన్ని కలవగా, పాఠశాల నిర్వాహకులు ఉత్సవాల నిర్వహణకు గాను తమవంతుగా నగదు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని ఉత్సవ సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు మాట్లాడుతూ…భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా ప్రణాళికలు వేస్తున్నట్లు వివరించారు. వినాయక చవితి పండుగకు తాండూరు ప్రాంత యువకులు పెద్దలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కోశాధికారి కిరణ్, కమిటీ ముఖ్య బాధ్యులు,తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ కొండంత భరోసా..!

0
  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  • తాండూరు నియోజకవర్గంలో 261 మందికి రూ. 1.50 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ

జనవాహిని ప్రతినిధి తాండూరు; ముఖ్యమంత్రి సహాయ నిధి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, తీవ్ర అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే కొండంత భరోసా అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1,50,00,000/- కోటి యాభై లక్షల రూపాయలు విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు బాధితులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీ నెరవేర్చిన కౌన్సిలర్..!

0
  • వార్డులోని 4 ప్రాంతాలకు కొత్త పేర్లు ఖరారు
  • మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రతిపాదిత తీర్మానం ఆమోదం

జనవాహిని ప్రతినిధి తాండూరు;ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాండూర్ మున్సిపల్ వార్డు నెంబర్ 7 కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ నెరవేర్చారు. తన పరిధిలోని నాలుగు ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు నామకరణం చేస్తానన్న మాట మేరకు, బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
హుస్సేన్ నగర్, కోకిల కాటేజ్,సుప్రీం కాలనీ, విలేమూన్ చౌరస్తా గా నామకరణం చేశారు.
వార్డులోని సమస్యలు, అవసరాలను గుర్తించి ఇచ్చిన హామీని అధికారిక తీర్మానం ద్వారా అమలు దిశగా ముందుకు తీసుకెళ్లడం పట్ల వార్డు నెంబర్ 7 ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ… “ప్రజలకు ఇచ్చిన మాటే నాకు అత్యంత ముఖ్యంమన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని దశలవారీగా నెరవేర్చి, వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని తెలిపారు.

కాంగ్రెస్‌ బాకీలు వసూలు చేస్తాం..!

0
  • మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి
  • కాంగ్రెస్ హామీలపై అగ్రహం 
  • బాకీలాన్ని వసూళ్లు చేస్తాం అంటూ భారీ నిరసన

జనవాహిని ప్రతినిధి తాండూరు ; ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, ప్రజలకు రావాల్సిన ప్రతి బాకీని వసూలు చేసే వరకు పోరాటం ఆగదని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శన హోరెత్తింది.
బీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం వైఫల్యాలపై “తాండూర్ చార్జ్‌షీట్”, “బాకీ కార్డు”లను ఆవిష్కరించిన అనంతరం, 420 హామీల ఫ్లెక్సీతో ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.82,500, పెన్షన్ల రూపంలో రూ.66,000, రైతు భరోసా ఇవ్వక నాలుగు ఎకరాలున్న రైతుకు రూ.1.02 లక్షల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండిపడ్డారు. స్కూటీలు, తులం బంగారం, విద్యాభరోసా హామీలన్నీ అటకెక్కాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, అక్రమ కేసులకు భయపడకుండా కేసీఆర్ నాయకత్వంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

సుదర్శన్ గౌడ్ పేరు ఖరారు…!

0
  • తాండూరు పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్
  • ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు ..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని ప్రముఖ శ్రీ పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్ నియామకం దాదాపు ఖరారైంది. ఆలయ పాలకమండలి నూతన చైర్మన్ ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లు సుదర్శన్ గౌడ్ పేరును స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆమోదం కోసం ప్రతిపాదించారు.
పార్టీ నాయకుల ప్రతిపాదనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సుదర్శన్ గౌడ్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
తన పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించి, ఆమోదం తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లకు సుదర్శన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు, దేవాలయ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ గౌడ్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.