Home Blog Page 3

అసత్య ప్రచారాలు మానుకోవాలి..!

0
  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై బిఆర్ఎస్ ఆరోపణలు నిరాధారం
  • దేవాలయ అభివృద్ధిని అడ్డుకోవద్దు: ఎస్. ప్రసాద్ గౌడ్

జనవాహిని ప్రతినిధి తాండూరు; స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు శ్రీ పోట్లీ మారాజ్ దేవాలయంపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవాస్తవ, నిరాధారమైన ఆరోపణలను వెంటనే మానుకోవాలని ఆలయ కార్యవర్గ సభ్యులు ఎస్. ప్రసాద్ గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ …
ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికారు. నిన్న బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ మరికొందరు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. శ్రీ పోట్లీ మారాజ్ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోని అత్యంత పవిత్రమైన స్థలమని తెలిపారు. ఆలయాన్ని కూల్చివేస్తున్నారని, స్థలాలను కబ్జా చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, ధైర్యముంటే దానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని సవాలు విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దేవాలయాన్ని వివాదాల్లోకి లాగడం తగదన్నారు.
దేవాలయ స్థలంలో నిబంధనల ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆలయానికి ఆదాయం సమకూర్చడం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచనల మేరకు చట్టానికి, ధర్మానికి లోబడే పనిచేస్తున్నామని తెలిపారు. దేవాలయ పవిత్రతను కాపాడటానికి, ఆలయాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆధారాలు లేని ఆరోపణలకు స్వస్తి పలకాలని ప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు.

రోహిత్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పష్టత ఏది..?

0
  • బుయ్యని సోదరుల సేవా కార్యక్రమాలపై విమర్శలు సరికావు
  • తాండూర్ యువ నేత వికాస్ జోషి

జనవాహిని ప్రతినిధి తాండూరు; మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేని వారు.. నిరంతరం ప్రజా సేవలో ఉన్న బుయ్యని సోదరులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని తాండూర్ నియోజకవర్గ యువ నేత వికాస్ జోషి మండిపడ్డారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ … ఇతరులపై విమర్శలు చేసే ముందు తమ రాజకీయ నిర్ణయాలు, వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాండూర్ ప్రాంతంలో గుడులు, బడులు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూముల కబ్జాపై మాట్లాడేవారు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు.
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి షాడో ఎమ్మెల్యే కాదని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాలు పంచుకునే ప్రజా సేవకుడని స్పష్టం చేశారు. 2020లో కరోనా కష్టకాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఉచితంగా శానిటైజర్లు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కుల, మత, వర్గ, వయోభేదాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం బుయ్యని సోదరుల నైజమని కొనియాడారు.
బుయ్యని సోదరులు అందిస్తున్న సేవలను చౌకబారు విమర్శలతో తగ్గించలేరని, ఎవరు ఎలాంటి వారో ప్రజలందరూ గమనిస్తున్నారని వికాస్ జోషి హెచ్చరించారు.

గోకులంగా మారిన పాఠశాల..!

0
  • తాండూరులో అలరించిన కృష్ణాష్టమి సంబరాలు
  • సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూళ్లలో ఉట్టికొట్టే వేడుకలు

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. నల్లనయ్య, అల్లరి కృష్ణుడు, గోపికాలోలుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారులు వేసిన కృష్ణుడు, గోపికలు మరియు దశావతారాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టికొట్టే పోటీలలో బాలకృష్ణుడి రూపంలో ఉన్న చిన్నారులు పోటీపడి పైకి ఎగురుతూ పెరుగు ఉట్టిని పగలగొట్టడం ప్రతి ఒక్కరినీ అలరించింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను మరువకూడదని పిలుపునిచ్చారు. చిన్ననాటి నుంచే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పాఠశాలల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వేడుకలలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అధికార మదంతో అబద్ధపు కేసులు…!

0
  • ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
  • కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు బిఆర్ఎస్ కౌంటర్
  • అబద్ధపు కేసులతో బిఆర్ఎస్‌ను ఆపలేరు
  • రోహిత్ రెడ్డి నేతృత్వంలో తాండూరుపై మళ్లీ గులాబీ జెండా ఖాయం

జనవాహిని ప్రతినిధి తాండూరు; ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ పార్టీ 34వ వార్డు కౌన్సిలర్ సుప్రీత కరుణాకర్ విమర్శలు చేశారు. గంజాయి, డ్రగ్స్ కేసులలో మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్లారంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను ఆమె ఖండించారు.
ఈ సందర్భంగా సుప్రీత కరుణాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల సంక్షేమామే ధ్యేయంగా సుపరిపాలన అందించిన ఘన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేశారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఎన్ని అబద్ధపు కేసులు, కుట్రపూరిత ఆరోపణలు చేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో బిఆర్ఎస్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాండూరు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు, వైఫల్యాలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

కాంగ్రెస్ జాగిరు కాదు..!

0
  •  భద్రేశ్వర ఆలయం!
  • మేడి మహేష్‌కు బిఆర్‌ఎస్ నాయకుడు రుద్రు పాటిల్ కౌంటర్
  • దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 
  • విమర్శలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు 

జనవాహిని ప్రతినిధి తాండూరు; పవిత్రమైన శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి కాదని, పవిత్ర స్థలాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు రుద్రు పాటిల్ మండిపడ్డారు. దేవాలయం ప్రాంగణంలో వార్తా సమావేశం నిర్వహించి మాట్లాడిన మేడి మహేష్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రుద్రు పాటిల్ మాట్లాడుతూ… భద్రేశ్వర దేవాలయ రినోవేషన్ కమిటీ చైర్మన్ ఆర్డర్ కాపీనే ఇంకా రాలేదని, అలాంటప్పుడు మేడి మహేష్ అసలు ఏ హోదాలో ఉండి మాట్లాడుతున్నారని నిలదీశారు. చేతిలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులూ లేకుండా చైర్మన్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మేడి మహేష్ మిగితా సభ్యులు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని, అది భద్రేశ్వర దేవాలయంలోని పవిత్రమైన ‘దాసోహం’ అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. భక్తుల భావోద్వేగాలు, నమ్మకాలతో ముడిపడి ఉన్న ఆలయ ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.
భద్రేశ్వర దేవాలయంలో ‘దాసోహం’ నిర్మాణాన్ని చేపట్టి, నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని  స్పష్టం చేశారు. నేటికి కూడా యువదళ్ సభ్యులే స్వయంగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని, లేని క్రెడిట్ కొట్టేయాలని చూస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ దుర్మార్గపు రాజకీయాలను పక్కనపెట్టి, ఆలయ పవిత్రతను కాపాడాలని హెచ్చరించారు.

బ్లాక్‌మెయిలర్ చరిత్ర నీది..!

0
  • ఇర్షాద్ ఆరోపణలను ఖండించిన బాతుల నాగు
  • పేదలను ముంచిన చరిత్ర నీది
  • ఆధారాలు ఉంటే చూపించు: కౌన్సిలర్ ఇర్షాద్‌కి బాతుల నాగు సవాల్

జనవాహిని ప్రతినిధి తాండూరు; కౌన్సిలర్ ఇర్షాద్ తనపై చేసినవన్నీ పచ్చి అబద్ధాలని, ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలని తాండూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు మండిపడ్డారు. తనపై కౌన్సిలర్ ఇర్షాద్ చేసిన వ్యాఖ్యలను నాగు ఖండించారు.
ఈ సందర్బంగా రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారే చౌకబారు సంస్కృతి నాది కాదని, నేను ఎప్పుడైనా, ఎవరి కాళ్లయినా మొక్కినట్లు నిరూపించగలవా? అంటూ నాగు సవాల్ విసిరారు. తాండూరు ప్రజలందరికీ ఇర్షాద్ ఎలాంటి బ్లాక్‌మెయిలరో స్పష్టంగా తెలుసని, అక్రమ దందాలు చేసే అలవాటు తనకంటే ఇర్షాద్‌కే ఎక్కువగా ఉందన్నారు. గతంలో తమ కుటుంబంలో జరిగిన భూవివాదం పూర్తిగా వ్యక్తిగతమని, అందులో రూపాయి చేతులు మారినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ వ్యవహారాలు, కుటుంబం కలహాలు వల్ల రోడ్డున పడకుండా చూసుకోవాలన్నారు.
గతంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ ఉదంతంలో, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విట్టల్ రెడ్డి బహిరంగంగా అందరి ముందే ఇర్షాద్‌ను రాస్కెల్,స్టుపిడ్ అంటూ బూతులు తిట్టి అసహ్యించుకున్నారో తాండూరు ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు.
తన కుటుంబ సభ్యులు వ్యాపార రీత్యా వడ్డీకి డబ్బులు ఇవ్వడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ— ప్రజలు కష్టాల్లో ఉండి, తమ ఇంటి గడప తొక్కి సహాయం కోరితేనే వడ్డీకి ఇస్తాం తప్ప బలవంతంగా ఎవరికీ ఇవ్వంమని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి, చివరికి వారిని ముంచిన ఘన చరిత్ర ఇర్షాద్‌దే అని బాతుల నాగు విమర్శించారు. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాళ్లు మొక్కిన గతం మర్చిపోయావా..!

0
  • నీ స్థాయి ఎంతో తెలుసుకుని మాట్లాడు
  • అక్రమ దందాలు మరచిపోయావా నాగరాజ్?
  • కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్‌పై కౌన్సిలర్ ఇర్షాద్ తీవ్ర ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ తన రాజకీయ స్థాయిని, తన గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ మండిపడ్డారు.
నడిరోడ్డుపై మనిషిని చంపిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నాగరాజ్, రోహిత్
రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్రమంగా ఇసుక దందాలు నడిపే నీకు ఆయన గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలకు 10 నుండి 20 రూపాయల వడ్డీలకు డబ్బులిచ్చి వారి రక్తం తాగే వడ్డీ వ్యాపారివని ఆరోపించారు. నాగరాజ్ కుటుంబం అక్రమాలకు అడ్డగా మారిందని, రోజూ మద్యం తాగి చిన్న చిన్న కుటుంబాలను, వారి పిల్లల భవిష్యత్తును పాడుచేసే వ్యక్తివని తీవ్ర ఆరోపణలు చేశారు.
నడిరోడ్డు వివాదాలు, ఎన్టీఆర్ కాలనీలో ఒక మహిళకు సంబంధించిన ఘటనలో పాత్ర, వాగుల నుంచి అక్రమ మట్టి తరలింపు వ్యాపారాలపై ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు రోహిత్ రెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి సహాయం పొందిన నాగరాజ్, ఇప్పుడు అవసరం తీరిన తర్వాత మాట మార్చడం ఆయన దిగజారుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. సహాయం పొందిన వ్యక్తిపైనే స్థాయి దాటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ విలువలకు విరుద్ధమన్నారు. తన వార్డ్ లో 400ఓట్లతో ఓడిపోయినా రాజకీయం నాగరాజు ది అని అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు చేయ్యడం విడ్డురంగా ఉందన్నారు. నడి రోడ్డు పై మర్డర్ లు చేసిన కుటుంబానికి పదవులు కట్టబెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదాని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోపణలు చేయడం సులభమేనని, ఆధారాలతో మాట్లాడటమే అసలు విషయమని స్పష్టం చేశారు. నాగరాజ్ ఇప్పటికైనా స్థాయి లేని వ్యక్తిగత విమర్శలు, అక్రమ దందాలు మాని ప్రజా సమస్యలపై మాట్లాడాలని కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు.

మహిళలను మోసం చేశారు..!

0
  • మహిళల హామీలను విస్మరించిన కాంగ్రెస్
  • తాండూరు భద్రేశ్వర కూడలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా-వార్పు
  • మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర విమర్శలు

జనవాహిని ప్రతినిధి తాండూరు; ఎన్నికల హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరులోని భద్రేశ్వర కూడలిలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై వృద్ధులు, వికలాంగులు, మహిళల సదస్సుతో పాటు వంటా-వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… నెలకు రూ.2,500 జీవన భృతి, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక వివాహం చేసుకున్న ఒక్క మహిళకైనా తులం బంగారం అందజేశారా అని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్న హామీ ఏమైందని నిలదీశారు.
ఉచిత బస్సు సౌకర్యం పేరిట తగినన్ని బస్సులు నడపకపోవడంతో తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాండ్‌లోనే నిరీక్షించాల్సి వస్తోందన్నారు. అలాగే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని కొద్దిమందికే పరిమితం చేసి, అందరికీ వర్తింపజేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మరిచిన హామీల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

డ్రగ్స్, గంజాయి దందాలో మాజీ ఎమ్మెల్యేదే చరిత్ర!

0
  • అమ్మాయిల సప్లై, డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లిన సంస్కృతి బిఆర్ఎస్ నాయకులది
  •  బిఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నిందలు వేస్తే ఊరుకోం: తాండూరు కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. గురువారం బిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వద్దే శ్రీను, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ ఎల్లప్ప తదితరులు పాల్గొని ఖండించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అబద్ధాల కంచుకోట అని, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ప్యాకేజీ స్టార్‌లు ఇప్పుడు ప్రెస్ మీట్‌లు పెట్టి మచ్చ లేని నాయకుడు మనోహర్ రెడ్డిపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్‌ నువ్వు ఒక ఐరన్ లెగ్వి, ఎక్కడుంటే అక్కడ భస్మమే అవుతుందన్నారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో పాటు ఇతర నాయకుల వద్ద ప్యాకేజీలు తీసుకున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.
మీ మాజీ ఎమ్మెల్యేనే గంజాయి, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా అమ్మాయిలను సప్లై చేసే దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లే సంప్రదాయం మీ మాజీ ఎమ్మెల్యేదేనని, అలాంటి చరిత్ర ఉన్నవారు, ప్రజాసేవకుడైన మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారనడానికి ఆధారాలు ఎక్కడున్నాయని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన హయాంలో ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, ఉత్తుత్తి శిలాఫలకాలతో ప్రజలను మభ్యపెట్టారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అప్పట్లో తాము వెనుక ఉండి నడిపించినా, తమపైనే దౌర్జన్యాలు చేశారని గుర్తుచేశారు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించడానికి ఎమ్మెల్యే దాకా అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులమైన మేమే చాలని స్పష్టం చేశారు.
డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదవులు ఇస్తున్నారని తెలిపారు. సైపూర్ కు చైర్మన్ పదవి ఇస్తానని మాజీ ఎమ్మెల్యే మోసం చేస్తే, తమ నాయకుడు మనోహర్ రెడ్డి కేవలం సైపూర్ కే 3 చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించారని ప్రకటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసమే నిబంధనల ప్రకారం ఇసుక అనుమతులు ఇస్తున్నామని, బిఆర్ఎస్ నాయకుల్లా దొంగతనంగా ఇసుకను దోచుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజు గౌడ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

మళ్ళీ ఎవక్యూ రచ్చ…!

0
  • తాండూరు ఎవక్యూ ప్రాపర్టీలో అక్రమ నిర్మాణాలు బంద్
  • వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసులు
  • కోర్టు/అధికారులను ఆశ్రయించిన పిటిషనర్
  • నకిలీ పత్రాలతో నిర్మాణాలు జరుపుతున్నారని స్థానికుల ఆరోపణలు

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న వినాయక చౌక్ ప్రాంతంలోని ఎవక్యూ ప్రాపర్టీ వ్యవహారం మళ్లీ సంచలనంగా మారింది. సదరు స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణిస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని నోటీసులు జారీ ఐనట్లు విశ్వాసనీయ సమాచారం.
గత కొన్ని నెలలుగా ఈ స్థలంలో మున్సిపల్ లేదా ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఒక వ్యక్తి పేరుమీద ఉన్న నకిలీ పత్రాలను సృష్టించి, దొంగ కాగితాల ఆధారంగానే ఈ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారని స్థానికంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే స్థానిక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులు/కోర్టులో పిటిషన్ దాఖలు వేసినట్లు సమాచారం. సదరు పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఎవక్యూ ప్రాపర్టీలో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం తో తాండూరు లో మళ్ళీ ఎవక్యూ ప్రాపర్టీ చర్చల్లోకి వచ్చింది. ఈ విషయం పై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.