Home Blog Page 5

సుదర్శన్ గౌడ్ పేరు ఖరారు…!

0
  • తాండూరు పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్
  • ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు ..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణంలోని ప్రముఖ శ్రీ పొట్లి మహారాజ్ దేవాలయ నూతన చైర్మన్ గా సుదర్శన్ గౌడ్ నియామకం దాదాపు ఖరారైంది. ఆలయ పాలకమండలి నూతన చైర్మన్ ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లు సుదర్శన్ గౌడ్ పేరును స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆమోదం కోసం ప్రతిపాదించారు.
పార్టీ నాయకుల ప్రతిపాదనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సుదర్శన్ గౌడ్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
తన పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించి, ఆమోదం తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, రాజు గౌడ్, రవి గౌడ్ లకు సుదర్శన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు, దేవాలయ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ గౌడ్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఛైర్‌పర్సన్‌పై ‘ఇజ్జత్ దావా’ వేస్తా..!

0
Screenshot
  • కౌన్సిలర్ జావీద్ హెచ్చరిక
  • అక్రమాలు నిరూపించాలని డిమాండ్..
  • ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఛైర్‌పర్సన్ తనపై కావాలని కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
తనపై మోపిన అక్రమ దందాల ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని కౌన్సిలర్ జావీద్ స్పష్టం చేశారు. తాను ఎక్కడ, ఎవరితో కలిసి బియ్యం దందా లేదా ఇతర అక్రమాలకు పాల్పడ్డానో ఛైర్‌పర్సన్ వెంటనే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ, స్థానికంగా తాండూరులోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, దమ్ముంటే తనపై మోపిన నిందలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఛైర్‌పర్సన్‌పై ‘ఇజ్జత్ దావా’ వేసి కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైఖరిని కూడా ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే 37వ కౌన్సిలర్‌గా వచ్చి కూర్చోవడం తప్ప, ఏ ఒక్క వార్డుకు ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి 8వ వార్డు పరిధిలోని రాజీవ్ ఇందిరమ్మ కాలనీ ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారని, అలాంటి వార్డుకు పాలకులు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. గడిచిన మూడేళ్లలో మున్సిపాలిటీలోని నిరుపేదలు నివసించే స్లమ్ వార్డులకు ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత అభివృద్ధి చేశారో బహిరంగంగా వెల్లడించాలని జావీద్ డిమాండ్ చేశారు.