దివికేగిన దివ్య దైవం – సిద్ధ‌గంగ శివైక్యం


జ‌నం మెచ్చిన దేవుడు ఇక లేడు. ఇక రాడు. విలువైన జీవితాన్ని ప్ర‌జా సేవ‌కే అంకితం చేసిన మహా యోగి సిద్ద‌గంగ మ‌ఠాధిప‌తి శివ‌కుమార స్వామీజి క‌ను మూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో త‌ల్ల‌డిల్లిన ఆ మాన‌వ‌తామూర్తి ఇక సెల‌వంటూ త‌ర‌లిరాని తీరాల‌కు వెళ్లిపోయారు. ఇక రానంటూ దివికేగారు. సామాన్యుల నుంచి రాజ‌కీయ నాయ‌కుల దాకా అంద‌రూ ఆయ‌న‌కు అభిమానులే. దేశ వ్యాప్తంగా ఎన్నో మ‌ఠాలు..మ‌ఠాధిప‌తులు..ఆల‌యాలు, ఆశ్ర‌మాలు ..గురువులు, స్వామీజీలు ..ప్ర‌వ‌క్త‌లు, ఫ‌కీర్లు..మ‌హానుభావులు ఎంద‌రో ఈ నేల‌పై జ‌న్మించారు. అలాంటి వారిలో ఎన్న‌ద‌గిన మ‌ఠాధిప‌తులలో శివ‌కుమార స్వామీజీ ముందు వ‌రుస‌లో నిలుస్తారు.
క‌న్న‌డ ప్ర‌పంచం శోక‌సంద్రంలో నిండి పోయింది. ప్ర‌తి ఒక్క‌రు కుల‌మతాల‌కు అతీతంగా స‌మానులేన‌ని..బ‌తికే అవ‌కాశం అంద‌రికీ ఉంద‌ని చేత‌ల్లో చాటి చెప్పిన మ‌హానుభావుడు ..న‌డిచే దైవమూర్తి ఆయ‌న‌. 111 ఏళ్లు బ‌తికారు. అనారోగ్యం ఇబ్బంది పెట్టినా స్వామీజి మాత్రం సేవ చేయ‌డం మానుకోలేదు. ఇదీ ఆయ‌న‌కున్న ప్ర‌త్యేక‌త‌. కొద్దిగా బ‌లం చేకూరితే చాలు కోట్లు కొల్ల‌గొట్టే వాళ్లున్న ఈ త‌రుణంలో స్వామి లాంటి వారు బ‌త‌క‌డ‌మే గొప్ప‌. దివ్య దైవంగా నేటికీ భ‌క్తులు కొలుస్తారు. రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం, వారి రాజ‌కీయాల‌లో వేలు పెట్ట‌డం , ప్ర‌చారాల‌కు పోవ‌డం, ఎప్పుడూ వార్త‌ల్లో ఉండ‌డం, త‌మ బ్రాండ్ పెంచుకోవ‌డం, బిజినెస్ టైకూన్స్‌తో రాసుకు పూసుకు తిరిగే స్వాములు ఎంద‌రో . ఆయ‌న ఆడంబ‌రాల‌కు దూరంగా ఉన్నారు. అన‌వ‌స‌ర జోక్యానికి తావీయ‌కుండా పేద‌లు, అనాధ‌లు, అన్నార్థుల కోసం అంకితం చేసిన శివ యోగి.
ఏ ప్ర‌భుత్వం, ఏ పార్టీ, ఏ నేత‌, ఏ కంపెనీ , ఏ వ్యాపార‌స్తుడు చేయ‌లేని గొప్ప‌నైన ప‌ని ఆయ‌న చేసి చూపించారు. అవ‌స‌ర‌మైతే డ‌బ్బులు ఇవ్వ‌లేక పోవ‌చ్చు..కానీ దేవుడు ఇచ్చిన వాటితో విద్య‌తో పాటు ఆక‌లిని తీర్చ‌వ‌చ్చు క‌దా అంటారు స్వామి ఒకానొక సంద‌ర్భంలో. ఒక ఏడు కాదు..ఏకంగా 80 సంవ‌త్స‌రాల పాటు సిద్ధ‌గంగ మ‌ఠాన్ని విజ‌య‌వంతంగా ..ఆద‌ర్శ‌వంతంగా న‌డిపించిన ఘ‌న‌త స్వామిదే. ఏ రోజు పొయ్యి ఎండి పోలేదు. ప్ర‌తి రోజు నిత్యం వేలాది మంది ఆక‌లిని తీరుస్తోంది. అక్ష‌రాల పూలు పూయిస్తోంది. పాఠ‌శాల‌లు, ఆస్ప‌త్రి ఇలా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌తి కార్య‌క్ర‌మానికి స్వామీజి శ్రీ‌కారం చుట్టారు. వాటికి ప్రాణం పోశారు. బెంగ‌ళూరు ప‌క్క‌నే ఉన్న మ‌గ‌దిలో 1907లో జ‌న్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన స్వామి కోట్లాది భ‌క్తుల‌కు ఇష్ట దైవంగా మారిపోయారు. చిన్న త‌నంలోనే స‌న్యాసం స్వీక‌రించారు. 1930లో మ‌ఠం నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పూజ‌లు చేయ‌డం, బ‌హుమ‌తులు స్వీక‌రించ‌డం లాంటి వాటికే ప‌రిమిత‌మై పోయిన మ‌ఠం రూపు రేఖ‌లు మార్చేశారు.
మ‌ఠంను ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌వేశం క‌ల్పించేలా చేశారు. పేదోడైనా
..పెద్దోడైనా..సామాన్యులైనా..వ్యాపారులైనా ..ఎవ‌రైనా ఆయ‌న‌ను ద‌ర్శించుకునేలా చేశారు. ఇదీ స్వామి వారికున్న ప్ర‌త్యేక‌త‌. చాలా మంది స్వామీజీలు ఆస్తులు పెంచుకుంటూ..కోట్లు కూడ‌బెడితే ..శివ‌కుమార స్వామీజీ మాత్రం అన్నింటిని వ‌దిలి వేసి మ‌ఠమే జీవితంగా బ‌తికారు. చివ‌రి దాకా అక్క‌డే శివైక్యం చెందారు. పార్టీల‌కు అతీతంగా స్వామీజీ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. లింగాయ‌త్ కులానికి చెందిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎవ్వ‌రినీ త‌క్కువ చేయ‌లేదు. ప్ర‌తి ఒక్కరిని ప్రేమగా ప‌ల‌క‌రించారు. ఆత్మీయంగా హ‌త్తుకున్నారు. జీవితానికి ప‌ర‌మార్థం ఏమిటంటే సాధ్య‌మైనంత మేర‌కు సేవ చేసే భాగ్యాన్ని క‌లిగి ఉండ‌డ‌మే అంటారు ఆయ‌న‌. మ‌ఠం ఆధ్వ‌ర్యంలోని సిద్ధ‌గంగ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీకి చెందిన 138 విద్యా సంస్థ‌ల్లో ల‌క్ష‌లాది మంది నిరుపేద విద్యార్థుల‌కు ఉచితంగా విద్య అందుతోందంటే అది స్వామి వారి చ‌ల‌వే.
అన్నార్థుల‌ను ఆదుకోవ‌డంలో స్వామి వారు అంద‌రికంటే ముందంజ‌లో ఉన్నారు. డ‌బ్బులు కొద్ది సేపే..కానీ ఆక‌లిని తీర్చ‌డం అన్న‌ది దైవం కంటే గొప్ప‌ది అంటారు. అందుకే నిత్యం అన్న‌దానం జ‌ర‌గాల్సిందే. ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండ‌టానికి వీలులేదంటారు. ఒక్క క‌ర్ణాట‌క‌లోనే కాదు దేశ మంత‌టా సిద్ధ‌గంగ మ‌ఠం ఆశ్ర‌మాలు ఎన్నో. ప్ర‌తి చోటా స్వామీజి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. పేద‌ల పాలిట స్వ‌ర్గ‌ధామాలుగా వినుతికెక్కాయి. స్వామి వారికి మ‌రో పేరుంది అదే న‌డిచే దైవం. నిస్వార్థంగా సేవ‌లందించిన ఈ మ‌హోన్న‌త మాన‌వుడు ఏది చేసినా స‌మాజ హితం కోస‌మే చేశారు. భ‌క్తుల‌ను, అభిమానుల‌ను, సేవ‌కుల‌ను అలా తీర్చిదిద్దారు. ఇదే స్వామి వారి అస‌లైన ప్ర‌త్యేక‌త‌. ఈ మ‌ఠానికి ఆరు వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉంది. క‌ర్ణాట‌క‌కు 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ మ‌ఠాన్ని దేశాన్ని ప్రభావితం చేసిన ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు ద‌ర్శించుకోవ‌డం ఓ చ‌రిత్ర‌.
మ‌ఠం ఆధ్వ‌ర్యంలో బ‌డులే కాదు..కాలేజీలు, ఇంజ‌నీరింగ్, బిజినెస్ మేనేజ్ మెంట్, న‌ర్సింగ్, ఫార్మ‌సీ, టీచ‌ర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ న‌డుస్తున్నాయి. ప్రీ యూనివ‌ర్శిటీ క్యాంప‌స్ కూడా ఉంది. ఆయా సంస్థ‌ల‌న్నింటిలో 8500 మంది చ‌దువుకుంటున్నారు. వీరింద‌రికీ ఉచితంగా భోజ‌నం అందుతోంది. వ‌స‌తి సౌక‌ర్యాల‌న్నీ మ‌ఠం చూసుకుంటుంది. తొలినాళ‌ల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. అనారోగ్యం కార‌ణంగా కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు. అయినా సేవ చేయ‌డం మాత్రం ఆప‌లేదు. కులం లేదు..మ‌తం లేదు..వ‌ర్గాలు లేవు..మాన‌వ‌త్వ‌మే అంతిమ మతం. ఇదే జీవితాన్ని మ‌రింత ప‌రిపుష్టంగా మార్చేస్తాయి. సాటి వారి ప‌ట్ల ప్రేమ‌..తోటి మ‌నుషుల ప‌ట్ల అభిమానం కంటే..ఎక్కువ‌గా వారిని మ‌నుషులుగా చూడాలి.
విద్య‌, వైద్యం, ఆక‌లితో లేకుండా ఉండ‌టం ఇదే మ‌ఠం ముందున్న స‌వాళ్లు. వాటిని గ‌త కొన్నేళ్లుగా నిరాటంకంగా కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. నేనున్నా లేక పోయినా ఎక్క‌డా నిలిచి పోవు. కాలం ఉన్నంత దాకా..సేవ‌లో నిమ‌గ్న‌మ‌వుతాయి. అన్న ఆ మ‌హ‌నీయుడు..దీనుల బాంధ‌వుడు..అన్నార్థుల పాలిట దేవుడు..త‌నువు చాలించారు. జీవిత‌మంతా సేవకే అంకితం చేసి..ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించిన ప్రేమ మూర్తి లేక పోవ‌డం క‌ర్ణాట‌క‌కే కాదు దేశానికి తీర‌ని న‌ష్టం. సేవ‌తో ప‌రిపుష్టమైన ఆ ప‌విత్ర పుణ్య‌ధామం సిద్ధ‌గంగ ఇపుడు శోక సంద్రంలో మునిగి పోయింది. స్వామి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సామాజిక సేవ‌కుడు..మ‌ఠం దార్శ‌నికుడు అయిన స్వామి వారు అంద‌రి గుండెల్లో కొలువై ఉంటారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అంద‌రి ప్ర‌యారిటీ హైద‌రాబాదే..!

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-post_88-7/#aHlkLmpwZw== దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇపుడు హైద‌రాబాద్ పేరే వినిపిస్తోంది. ఐటీతో పాటు రియ‌ల్ ఎస్టేట్ రంగం మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్లాట్లు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్‌తో పాటు విల్లాల‌కు డిమాండ్ పెరిగింది. స్థిర‌మైన ప్ర‌భుత్వం కొలువు తీరి ఉండ‌డం, వాణిజ్య‌, వ్యాపారాల‌కు అనువుగా ఉండేలా చ‌ట్టాలు […]