అంద‌రి ప్ర‌యారిటీ హైద‌రాబాదే..!


దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇపుడు హైద‌రాబాద్ పేరే వినిపిస్తోంది. ఐటీతో పాటు రియ‌ల్ ఎస్టేట్ రంగం మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్లాట్లు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్‌తో పాటు విల్లాల‌కు డిమాండ్ పెరిగింది. స్థిర‌మైన ప్ర‌భుత్వం కొలువు తీరి ఉండ‌డం, వాణిజ్య‌, వ్యాపారాల‌కు అనువుగా ఉండేలా చ‌ట్టాలు చేయ‌డంతో వ్యాపారుల పంట పండుతోంది. ఉద్యోగాల ప‌రంగా అపార‌మైన అవ‌కాశాలు ద‌క్క‌డంతో ఇండియాలోని అన్ని న‌గ‌రాల‌కంటే భాగ్య‌న‌గ‌రాన్నే ఎంచుకుంటున్నారు. మొన్న‌టి దాకా బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబ‌యి ప్రిఫ‌ర్ చేసిన జ‌నం ఇపుడు హైద‌రాబాద్ నేమ్‌ను స్మ‌రిస్తున్నారు. ఐటీ, హెల్త్, లాజిస్టిక్స్, ఈ కామ‌ర్స్ , పెట్రో, కెమిక‌ల్, మైన్స్, హోట‌ల్ టూరిజం ప‌రంగా టాప్ రేంజ్ లో తెలంగాణ దూసుకెళ్ల‌డం మ‌రో అసెట్‌గానే చెప్పాల్సి ఉంటుంది.
ఒక‌ప్పుడు హైద‌రాబాద్ అంటే జ‌డుసుకునే వాళ్లు ఇపుడు సై అంటున్నారు. ర‌వాణా ప‌రంగా అన్ని సౌక‌ర్యాలు ఉండ‌డంతో ఈ న‌గ‌రానికే ఓటు వేస్తున్నారు. తెలంగాణ పేరు ఎత్త‌నీయ‌కుండా తొక్కి పెట్టిన వారంతా ఇపుడు దీని పేరు ఎత్త‌కుండా మాట్లాడ‌టం లేదు. ఈ క్రెడిట్ అంతా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ కే ద‌క్కుతుంది. అతిర‌థ మ‌హార‌థులు, రాజ‌కీయ దిగ్గ‌జాలు, బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, వ్యాపార‌వేత్త‌లు, కంపెనీల దిగ్గ‌జాలు అన్నీ ఇపుడు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వైపు ప‌రుగులు తీస్తున్నాయి. కొత్త‌గా వ్యాపారాలు చేసుకునే వారికి రాయితీలు ప్ర‌క‌టించిందీ స‌ర్కార్. దీంతో దీనినే ఎంచుకుంటున్నారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి మ‌రో 16 శాతం వ్యాపార రంగాలు పెరిగాయి. 40 ల‌క్ష‌ల నుండి కోటి రూపాయ‌ల దాకా ధ‌ర ప‌లికిన స్థ‌లాలు, ప్లాట్లు,ఫ్లాట్స్, విల్లాస్ ఇపుడు రెండు కోట్ల వ‌ర‌కు చేరుకుంది.
ఇదంతా రియ‌ల్ మాయ లేక స‌ర్కార్ ఇస్తున్న ప్రోత్సాహ‌కాలా తెలియ‌డం లేదు. ముంబ‌యి, ఢిల్లీ, బెంగ‌ళూరు స‌హా దేశంలోని బ‌డా సంస్థ‌ల‌న్నీ ఇటు వైపే చూస్తున్నాయి. త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. క‌మ‌ర్షియ‌ల్ స్పేష్ ప‌రంగా చూస్తే అన్ని న‌గ‌రాల‌లో కంటే హైద‌రాబాద్ చాలా అనువుగా ఉండ‌డంతో ఇక్క‌డికి క్యూ క‌డుతున్నారు. సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, ఉత్త‌మ రీతిలో మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో ఒక్క ఏడాదిలోనే ధ‌ర‌లు రెట్టింప‌య్యాయి. 15 శాతానికి పైగా సేల్స్ పెరిగాయి. ల‌గ్జ‌రీ విల్లాలు, గేటెడ్ క‌మ్యూనిటీల్లో ఎక్కువ‌గా పెట్టుబడులు వ‌చ్చాయి. రియ‌ల్ ఎస్టేట్‌, క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలతో పాటు సిమెంట్, లాజిస్టిక్ రంగాలకు ప్రాధాన్య‌త పెరుగుతూ వ‌చ్చింది. వీటి మీద ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది మంది ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా బ‌తుకుతున్నారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల‌కు ఎక్క‌డ‌లేని డిమాండ్ పెరిగింది.
శంషాబాద్, ప‌టాన్ చెరు, లింగంప‌ల్లి, మాదాపూర్, కొంప‌ల్లి, ఘ‌ట‌కేస‌ర్, యాదాద్రి, ముచ్చింత‌ల్, షాద్‌న‌గ‌ర్, కొత్తూరు, బొంగ్లూరు జంక్ష‌న్, ఇబ్ర‌హీంప‌ట్నం, సాగ‌ర్ రింగ్ రోడ్, ఎల్ బీ న‌గ‌ర్, నాగోల్, ఉప్ప‌ల్, హ‌య‌త్ న‌గ‌ర్, కూక‌ట్ ప‌ల్లి, అమీర్ పేట‌, పంజాగుట్ట‌, బేగంపేట‌, శంక‌ర్ ప‌ల్లి, నార్సింగ్, బాలాపూర్, అత్తాపూర్, మెహ‌దీప‌ట్నం , లాంటి ప్రాంతాల‌న్నీ ఇపుడు కోట్లు ప‌లుకుతున్నాయి. ల‌క్ష‌ల్లో ఉన్న‌వ‌న్నీ ఇపుడు కోట్ల‌కు చేరాయి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాసులంతా ఇపుడు క‌రోడ్‌ప‌త్‌లు అయ్యారు. ఎన్ ఆర్ ఐలు ఫ్లాట్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగ‌స్తులు కావ‌డంతో ఒక‌రి జీతాన్ని అపార్ట్‌మెంట్ కొనేందుకు వినియోగిస్తున్నారు. బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఇస్తున్నాయి. బిల్డ‌ర్లు బ్యాంక‌ర్ల‌తో టైఅప్ చేసుకోవ‌డంతో లోన్స్ ఈజీగా దొరుకుతున్నాయి.
ఆదాయ ప‌న్ను ఆదా కావ‌డంతో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు, ఉద్యోగ‌స్తులు అంతా వీటిని కొనేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు. రాజ‌కీయ స్థిర‌త్వం క‌లిగిన న‌గ‌రంగా పేరు ఉండ‌డం కూడా అద‌న‌పు అడ్వాంటేజ్ గా భావించాలి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న ఐటీ, ఫార్మా, బ‌యో టెక్నాల‌జీ, మొబైల్ ఫోన్ల త‌యారీ రంగాల‌న్నీ ఇక్క‌డే కొలువు తీరాయి. కొత్త కంపెనీల‌కు తోడు మ‌రికొన్ని కంపెనీలు ఏర్పాటు కావ‌డంతో ఉద్యోగాల క‌ల్ప‌న పెరిగింది. ఆఫీస్ స్పేసెస్‌కు ప్రాధాన్య‌త పెరిగింది. రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది కాలంలో 25 శాతం నుంచి 30 శాతం వృద్ధి సాధించ‌డం గ‌మ‌నార్హం. అయితే ప్రాజెక్టులు పూర్తి కాక ముందే ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుండి పై స్థాయి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికి ఇపుడు స్వంతంగా ఇల్లు ఉండ‌డం అనేది అత్య‌వ‌స‌రంగా మారింది.
చుట్టు ప‌క్క‌ల ఐటీ, ఫార్మా , టెలికాం కంపెనీల‌న్నీ ఇక్క‌డే కొలువుతీరి ఉండ‌డంతో బెస్ట్ ప్ర‌యారిటీ ప్లేస్ గా దీనినే ఎంచుకుంటున్నారు. జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గ‌డం కూడా మ‌రో కారణమ‌ని బిల్డ‌ర్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. చాలా మంది గ‌తంలో వ‌చ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో జ‌మ చేసుకునే వారు. ఇటీవ‌ల బ్యాంకుల్లో వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డంతో అంతా స్థిర ఆస్తుల‌పై వెచ్చిస్తున్నారు. దీంతో వీటికి మ‌రింత ప్రాధాన్య‌త పెరిగింది. షేర్ మార్కెట్ల‌లో కంటే రియ‌ల్టీ, బిల్డింగ్ నిర్మాణాల్లో ఇన్వెస్ట్ చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ప్లాటో, ఫ్లాటో కొని పెట్టుకుంటే భ‌విష్య‌త్‌లో మంచి లాభాలు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఈ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి దోహద ప‌డింది. రాష్ట్రానికి చెందిన కంపెనీలే కాకుండా బెంగ‌ళూరు, కోల్‌క‌త‌, ముంబ‌యి, ఢిల్లీకి చెందిన వారంతా హైద‌రాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారు.
కేపిట‌ల్ సిటీతో పాటు చుట్టు ప‌క్క‌ల ల‌గ్జ‌రీ విల్లాలు ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్నాయి. ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన వారితో పాటు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వారు సైతం సోష‌ల్ సెక్యూరిటీ, వ‌సతుల క‌ల్ప‌న‌, ర‌వాణా సౌక‌ర్యం ఉండే వాటిని ఇష్ట ప‌డుతున్నారు. దీంతో బిల్డ‌ర్స్ , క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు సైతం వీటిని స‌మ‌కూర్చుతున్నారు. కోకాపేట‌, పుప్పాల‌గూడ‌, త‌దిత‌ర ప్రాంతాల్లో 3 కోట్ల నుండి 10 కోట్ల ధ‌ర‌లు ప‌లుకుతున్నాయి. ఆఫీస్ స్పేస్ విభాగంతో పాటు రెసిడెన్షియ‌ల్ స్థ‌లాల‌పై లావాదేవీలు భారీ ఎత్తున జ‌రిగాయి. 2017లో రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ను డీమానిటైజేష‌న్, రెరా, జీఎస్టీ వంటివి ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి ప్ర‌భావితం చూపినా హైద‌రాబాద్‌లో మాత్రం కొనుగోళ్లు ఆగ‌లేదు. మొత్తం మీద హైద‌రాబాద్ ఐటీలోనే కాదు రియాల్టీలోను వెలిగి పోతోంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. సో మీ ద‌గ్గ‌ర డ‌బ్బులుంటే స్థిరాస్తుల‌పై పెట్టుబ‌డి పెట్టండి. ఎంతో కొంత వెన‌కేసుకుంటారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఆశావ‌హులు

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email విజ‌యాల వంతెన మీద స్వారీ చేస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎవ‌రిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి..ఇంకెవ‌రిని ప‌క్క‌న పెట్టాల‌న్న దానిపైనే క‌స‌ర‌త్తు సాగుతోంది. ఓ వైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌రో వైపు తెలంగాణ రాష్ట్ర పాల‌న కొన‌సాగాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప‌నిచేసే టీం ఉండాల్సిందే. ఊహించ‌నిరీతిలో గెలుపు వాకిట […]