విజయాల వంతెన మీద స్వారీ చేస్తున్న గులాబీ దళపతికి మంత్రివర్గ విస్తరణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి..ఇంకెవరిని పక్కన పెట్టాలన్న దానిపైనే కసరత్తు సాగుతోంది. ఓ వైపు ఫెడరల్ ఫ్రంట్ మరో వైపు తెలంగాణ రాష్ట్ర పాలన కొనసాగాలంటే తప్పనిసరిగా పనిచేసే టీం ఉండాల్సిందే. ఊహించనిరీతిలో గెలుపు వాకిట చేర్చిన ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ముఖ్యం. దీని మీదనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. పనిచేసే యంత్రాంగం ఉన్నప్పటికీ ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినా పూర్తి స్థాయిలో ఫలితాలు ప్రకటించక పోవడం కొంత ఇబ్బందిగా మారింది.
దీనిని త్వరగా పూర్తి చేయగలిగితే ప్రభుత్వానికి కొంచెం వెసలుబాటు కలుగుతుంది. ఓ వైపు గ్రామ పంచాయతీల ఎన్నికల్లో 90 శాతానికి పైగా అధికార పార్టీకి చెందిన వారే కొలువు తీరనున్నారు. పనులు కావాలన్నా..అభివృద్ధి పూర్తి స్థాయిలో పూర్తి కావాలన్నా..మరిన్ని నిధులు మంజూరు కావాలంటే తప్పనిసరిగా గులాబీ చెంత చేరాల్సిందే లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ఏ గ్రామ పంచాయతీ అయినా సరే ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోగలిగితే 25 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన ఆశావహుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా తమ తమ నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల పోటీ అనివార్యం కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి టీఆర్ ఎస్ నుండే సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కోసం పోటీ నెలకొంది. సింగిల్ విండో, సహకార సంఘాల ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. అంతలోపే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు రానున్నాయి. ఈసారి టీఆర్ ఎస్ క్లీన్ స్విప్ చేయాలన్నది గులాబీ బాస్ టార్గెట్ పెట్టుకున్నారు.
ఆ దిశగా ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. అయిదు మంది మినహా మొత్తం సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడంతో కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పరంగా పాత వారు..కొత్తగా ఎన్నికైన వారు మంత్రి పదవులు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు మాత్రం అధికారికంగా కొలువుతీరినట్టయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం శాఖా మంత్రిగా మహమూద్ అలీ, స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్త పాలనలో కొలువు తీరారు.
స్పీకర్ ఎంపిక కొలిక్కి రావడంతో మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులతో పాటు పార్లమెంటరీ కార్యదర్శి పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
స్పీకర్ ఎంపిక కొలిక్కి రావడంతో మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులతో పాటు పార్లమెంటరీ కార్యదర్శి పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, నాయని నర్శింహారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పట్నం నరేందర్ రెడ్డి, బాల్క సుమన్, జోగు రామన్న, కడియం శ్రీహరి, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, గొంగడి సునీత, రేఖా నాయక్‌లతో పాటు పలువురు ఉన్నారు. చాలా మంది తమ పూర్తి వివరాలను కేటీఆర్ కు ఇప్పటికే అందజేశారు. ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రయత్నాల్లో మునిగి పోయారు. పండగ తర్వాత విస్తరణ ఉంటుందని అనుకున్నారు. ఇపుడు విస్తరణ ఉంటుందా లేక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందా అని టెన్షన్‌కు లోనవుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రకారం చూస్తే 18 కంటే మించ కూడదు.
వీరిలో ఎవరికి దక్కుతుందోనని గులాబీ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంకో వైపు సీఎం మందిలో ఏమున్నదో ..ఎవరికి ఆ అరుదైన అవకాశం దక్కనుందోనని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు మరింత చేరువగా ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, గెలుపు గర్వాన్ని పక్కన పెట్టి ప్రజా సేవకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఇంతకు ముందు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో దిశా నిర్దేశనం చేశారు. మంత్రిమండలి కూర్పుపై సీఎం కేసీఆర్ ఒక్కరే కసరత్తు చేస్తుండడం, పెద్దాయన నుండి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో గతంలో మంత్రులుగా పని చేసిన నాయకులు కూడా తమకు కచ్చితంగా అవకాశం ఉండేది లేనిదీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో గంపెడాశలు పెట్టుకున్న ఆశావాహులు భగవంతుని మీద భారం వేసి దైవ దర్శనాలకు వెళ్లి వస్తున్నారు. పోచారంకు స్పీకర్ పదవి దక్కడంతో నిజామాబాద్ జిల్లా నుండి వేముల ప్రశాంత్ రెడ్డిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఈసారి శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, పద్మారావు ఉన్నారు. దాస్యం వినయ్ బాస్కర్ కూడా రేసులో ఉన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌తో పాటు నోముల నర్సింహయ్యను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. బుగ్గ కారులో ప్రయాణం చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో చూడాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే