ఏళ్లు గడిచినా పాటల్లోని మాధుర్యం తగ్గడం లేదు. కభి కభీ సినిమా నేటికీ హృదయాలను హత్తుకుంటోంది. లక్షలాది మంది ఇంకా ఆ సినిమాలోని ప్రతి పాటా గుండెకు తాళం వేసేదే. ఎన్ని సార్లు చూసినా వెంటాడుతూనే ఉంటుంది ఆ సినిమా. యాష్ చోప్రాకు ఓ రకంగా రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే దీనిని నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించింది కూడా ఆయనే కనుక. బాలీవుడ్లో ఇప్పటికీ ఈ సినిమాకు ఎనలేని క్రేజ్ ఉంది. 1976లో ఇది విడుదలైంది. అంటే దాదాపు 45 ఏళ్లు గడిచి పోయాయి. సమ్మోహన పరిచేలా..పూల పాన్పులా హత్తుకుంటూనే ఉంది. ఎప్పుడు చూసినా..విన్నా పరిమళంలా అల్లుకుపోతుంది.
ఈ మూవీకి కథను పమేలా చోప్రా హృద్యంగా రాశారు. సాగర్ సర్హాది స్క్రీన్ ప్లే నిర్వహించారు. అమితాబ్ బచ్చన్, శశికపూర్, రాఖీ, వహీదా రెహమాన్, నీతూ సింగ్ నటించారు. పాత్రల్లో జీవించారు. సినిమాకు అత్యున్నతమైన సంగీతాన్ని అందించిన ఘనత ఖయ్యాందే. సాహిర్ లుధియాన్వి గీతాలు రాశారు. చాలా నెమ్మదిగా విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని స్వంతం చేసుకుంది. రొమేష్ బొల్లా సినిమాటోగ్రఫీ అందించగా నరేష్ మల్హోత్ర ఎడిటింగ్ చేస్తే..ప్రాణ్ మెహ్రా ప్రొడక్షన్ కంపెనీ , యాష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఫిబ్రవరి 27న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. 178 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా హృదయాత్మకంగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాకు సంగీతం హైలెట్‌గా నిలిచింది.
అప్పట్లో బాక్సాఫిస్ బద్దలు కొట్టింది. ఏకంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులను తిరగ రాసింది. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ఇది. యాష్ చోప్రా దర్శకత్వంలో మొదటి సినిమా దీవార్ విడుదల కాగా కభి కభీ సినిమా రెండోది. దీవార్ లో అమితాబ్, శశి కపూర్ లీడ్ రోల్స్ పోషించగా కభి కభీలో కూడా వీరిద్దరు ప్రధాన పాత్రల్లో లీనమై నటించారు. చోప్రా..రెండు మూవీస్ కు ఖయ్యాం మ్యూజిక్ అందించారు. సినిమా అంతా కవితాత్మకంగా ఉంటుంది. ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు స్వంతం చేసుకుందీ ఈ సినిమా. గీత రచయిత సాధ్విర్ లుధియాన్వి బెస్ట్ లిరిసిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. కభి కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆథా హై..అంటూ ముఖేష్ పాడిన పాటకు జనం ఫిదా అయ్యారు. బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు స్వంతం చేసుకున్నారు.
కథా పరంగా చూస్తే అమితాబ్ అమిత్ మల్హోత్రా కవిగా పేరొందారు. కాలేజీలో తనతో కలిసి చదువుకుంటున్న పూజా పాత్రలో నటించిన రాఖీతో కలుస్తారు. వీరిద్దరు ప్రేమలో పడతారు. అనుకోకుండా పూజా తల్లిదండ్రులు ఆర్కిటెక్ట్ గా ఉన్న శశి పోషించిన విజయ్ ఖన్నాతో పెళ్లి కుదురుతుంది. దీంతో అమితాబ్ తీవ్ర నిరాశకు లోనవుతాడు. తన తండ్రి బిజినెస్ మెన్ కావడంతో ఆయన వ్యాపారాల్లో పాలుపంచుకుంటాడు. అంజలి పాత్రలో పోషించిన వహీదా రెహమాన్‌తో పెళ్లవుతుంది. వీరిద్దరికి ఓ కూతురు కలుగుతుంది. పింకీని కపూర్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. పూజా , విజయ్‌లకు ఓ కుమారుడు . విక్రం పాత్ర పోషించిన రిషీ కపూర్ పింకీ ప్రేమలో పడతారు. పింకీ తన రియల్ మదర్ గురించి తెలుసుకుంటుంది.
ఇలా ప్రతి పాత్ర మనల్ని కట్టి పడేసేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇందులోని పాటలన్నీ ఆల్ టైం రికార్డుగా నిలిచాయి. ప్రతి ఏటా టాప్ టెన్ లో నిలిచాయి. రేడియో సిలోన్లో కంటిన్యూగా ఈ పాటలను ప్రసారం చేశారు. సినిమా పరంగా పాత్రలు మాట్లాడతాయి. మనల్ని కట్టి పడేస్తాయి. కభి కభీ మేరే దిల్ మే అంటూ ముఖేష్ పాడితే..మరో వెర్షన్లో ముఖేష్‌తో పాటు లతా మంగేష్కర్ హృద్యంగా ఆలాపించారు. మై పల్ దో పల్ కా షాయర్ హూ , మై హర్ ఏక్ పల్ కా షాయర్ హూ అంటూ ముఖేష్ కట్టి పడేశాడు. చాహే చాలే చురియా అంటూ కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడగా, కభీ కభీ మేరే దిల్ మే అంటూ అమితాబ్ బచ్చన్ డైలాగ్‌లు ఇప్పటికీ రింగ్ టోన్లుగా వాడుకుంటున్నారంటే ఆ పాటలకున్న క్రేజీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
మేరే ఘర్ ఆయే ఏక్ నాన్హి పారి అంటూ లత పాడితే ప్యార్ కర్ లియాతో క్యా అంటూ కిషోర్ పాడారు. సుర్క్ జోడే కి అంటూ లతా , పమేలా చోప్రా ఆలాపిస్తే..తేరే చెహ్రే సే అంటూ కిషోర్, లతా పాడి సినిమా సక్సెస్‌కు కారణమయ్యారు. మూడ్ బావోలేనప్పుడు ..గుండె మండుతున్నప్పుడు..బతుకంతా బాధలో ఉన్నప్పుడు..మన వాళ్లు వదిలి వేసినప్పుడు కాస్తంత టైం తీసుకుని కభి కభీ పాటలు వింటే చాలు ..జీవితం ఎంత మధురమో తెలుస్తుంది. ఇంకెన్నేళ్లయినా సరే ఈ సినిమా అలానే ఉంటుంది.